మహానటి సావిత్రి... దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో ఈ పేరు రెండు దశాబ్దాలపాటు మారుమోగిపోయింది. అందం, అభినయంతోపాటు మంచితనం కలగలసిన అచ్చ తెలుగు అమ్మాయి సావిత్రి. ఆమె నటనకు ప్రేక్షకులే కాదు, ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు కూడా అభిమానులే. తరాలు మారినా సావిత్రి పేరు ఇప్పటికీ చెక్కు చెదరలేదు అంటే సినీ ప్రేక్షకులు తమ మనసుల్లో ఆమెకు ఎలాంటి స్థానాన్ని ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. సావిత్రికి నటన రాదు అని హేళన చేసిన వారే ఆ తర్వాత ఆమె అభినయం చూసి అబ్బురపడ్డారు, ఆమెకు అభిమానులైపోయారు. సినీ పరిశ్రమలోని కొందరు మహానటి సావిత్రిని అమ్మ అని సంభోదిస్తారు. వాస్తవానికి అమ్మ అని పిలవదగ్గ మంచితనం, మానవత్వం ఆమె సొంతం. అలాంటి మహానటి, మహోన్నత వ్యక్తి జీవిత విశేషాలు, సినీ జీవిత విశేషాల గురించి ఆమె బయోగ్రఫీలో తెలుసుకుందాం.
1936 డిసెంబర్ 6న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు సావిత్రి. తన ఆరు సంవత్సరాల వయసులో తండ్రి అనారోగ్యంతో మరణించారు. గురవయ్య మరణంతో సుభద్రమ్మ విజయవాడలోని తన అక్క అయిన దుర్గాంబ ఇంటికి మకాం మార్చింది. దుర్గాంబ భర్త పేరు కొమ్మారెడ్డి వెంకట్రామయ్య చౌదరి. సావిత్రికి పెదనాన్న అవుతారు. సావిత్రి విజయవాడలోని కస్తూరిబాయి మెమోరియల్ పాఠశాలలో చేరారు. పాఠశాలకు వెళ్ళే దారిలో నృత్య విద్యాలయం ఉండేది. రోజూ ఇతరులు నాట్యం చేయటం చూసి ఆ నృత్యనిలయంలో చేరి శిష్‌ట్లా పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం, శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నారు. విజయవాడలో తన చిన్నతనంలోనే నృత్య ప్రదర్శనలు ఇచ్చారు సావిత్రి. కొంతకాలం ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి, అనంతరం స్వయంగా పెదనాన్న నడిపిన నాట్య మండలిలో కూడా నటించింది. బుచ్చిబాబు రాసిన ఆత్మవంచన అనే నాటకంలో ఆమె నటనకు అందరూ ముగ్ధులయ్యారు. 13 సంవత్సరాల వయసులో కాకినాడలోని ఆంధ్ర నాటక పరిషత్ నిర్వహించిన నృత్యనాటక పోటీలలో గెలుపొంది ఆనాటి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు పృథ్విరాజ్‌కపూర్ చేతులమీదుగా బహుమతి అందుకున్నారు. సినిమాల పట్ల ఆమెకు ఆసక్తి పెరగడానికి అది ఒక కారణమైంది. సావిత్రి నటన చూసినవారంతా సినిమాల్లో అయితే మంచి అవకాశాలు వస్తాయని వెంకట్రామయ్యకు చెప్పడంతో సావిత్రిని తీసుకొని మద్రాస్ చేరుకున్నారు.
ఎన్నో ప్రయత్నాల తర్వాత ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న సంసారం చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. సావిత్రికి అక్కినేని నాగేశ్వరరావు అంటే ఎంతో అభిమానం. ఆ సినిమాలో ఆయనే హీరో కావడంతో ఆయన్ని చూసిన ఆనందంలో డైరెక్టర్ చెప్పిన విధంగా నటించలేకపోయారు. దాంతో సావిత్రి సినిమాలకు పనికి రాదని ఆమెను తీసేసి పుష్పలత అనే అమ్మాయికి అవకాశం ఇచ్చారు. సావిత్రిని వెనక్కి పంపడం దేనికి అని ఆలోచించిన ఎల్.వి.ప్రసాద్ రెండు సీన్స్‌లో మాత్రమే కనిపించే చిన్న పాత్ర ఇచ్చారు. అలా సావిత్రి నటించిన తొలి సినిమా సంసారం. ఆ తర్వాత రూపవతి చిత్రంలో ఒక పాత్ర చేశారు. అదే సమయంలో పాతాళభైరవి చిత్రంలో ఓ పాటలో నటించే అవకాశం రావడంతో అది కూడా చేశారు. అలా 1950లో మూడు సినిమాల్లో నటించారు సావిత్రి. దాంతో ఆమెకు కెమెరా అంటే భయం పోయింది. అంతేకాదు, నటనలోని మెళకువలు కూడా తెలుసుకున్నారు. ఆ తర్వాత ఓ సంవత్సరం పాటు సంక్రాంతి, శాంతి, ఆదర్శం వంటి సినిమాల్లో చిన్న పాత్రలు చేశారు.
సావిత్రి కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమా పెళ్లిచేసిచూడు. ఈ సినిమాతో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే నిర్మాత డి.ఎల్.నారాయణ ఓ బెంగాలీ నవల ఆధారంగా దేవదాసు చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. హీరో అక్కినేని నాగేశ్వరరావు, డైరెక్టర్ వేదాంతం రాఘవయ్య, సంగీత దర్శకుడు సి.ఆర్.సుబ్బరామన్. అంతా బాగానే ఉంది కానీ, హీరోయిన్ ఎవరైతే బాగుంటుందనే విషయంలో దర్శకనిర్మాతలు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. పార్వతి పాత్ర కోసం మొదట భానుమతిని అనుకున్నారు. కానీ, ఆమె ఆ పాత్ర చెయ్యనని చెప్పారు. ఆ తర్వాత షావుకారు జానకిని సంప్రదించారు. అప్పటికే సినిమాలతో బిజీగా ఉన్న జానకి ఆ అవకాశాన్ని వదులుకున్నారు. అప్పుడు ఆ పాత్రకు సావిత్రి అయితే కరెక్ట్‌గా సరిపోతుందని భావించి ఆమెనే ఖరారు చేశారు. 1953 జూన్ 26న దేవదాసు విడుదలై అఖండ విజయం సాధించింది. ఈ చిత్రంలో సావిత్రి నటన చూసి అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. పార్వతి పాత్రలో ఆమె నటించలేదని, జీవించిందని కొనియాడారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత మిస్సమ్మ సావిత్రి కెరీర్‌లో మరో పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా. దీని తర్వాత వెల్లువలా సినిమా అవకాశాలు వచ్చాయి. అర్థాంగి, సంతానం, దొంగరాముడు, కన్యాశుల్కం, తోడికోడళ్ళు, భలే రాముడు వంటి సినిమాలు హీరోయిన్‌గా సావిత్రి స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఆ క్రమంలోనే 1957 కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాబజార్ చిత్రం సావిత్రిని తిరుగులేని స్టార్ హీరోయిన్‌ని చేసేసింది. ఎస్వీ రంగారావు కూడా అబ్బురపడే రీతిలో నటనను ప్రదర్శించి ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక అప్పటి నుంచి ఎన్నో వైవిధ్యమైన, విభిన్నమైన పాత్రలు పోషించిన సావిత్రి అందరు హీరోల సరసన లెక్కకు మించిన సినిమాల్లో నటించారు. మంచి మనసులు, మూగమనసులు, రక్తసంబంధం, ఆరాధన, గుండమ్మకథ, వెలుగునీడలు, పూజాఫలం, మాంగల్యబలం, డాక్టర్ చక్రవర్తి, దేవత, సుమంగళి..ఇలా సావిత్రికి నటిగా మంచి పేరు తెచ్చిన సినిమాలు ఎన్నో వున్నాయి.
ఇక ఆమె వ్యక్తిగత విషయాలకు వస్తే.. మల్లెపూలు, వర్షం సావిత్రికి బాగా ఇష్టమైనవి. ఆమెది ఎడమ చేతివాటం. క్రికెట్, చదరంగం ఆటలను బాగా ఇష్టపడేవారు. చెన్నైలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆమె తప్పకుండా హాజరయ్యేవారు. వెస్టిండీస్ క్రికెటర్ గ్యారీ సోబర్స్ అంటే ఆమెకు అభిమానం. ఆ రోజుల్లోనే శివాజీగణేశన్‌తోపాటు తారల క్రికెట్ మ్యాచ్‌లలో పాల్గొనేవారు. సావిత్రి మంచి చమత్కారి. అంతే కాదు, ఇతరులను అనుకరించటంలో కూడా దిట్ట. ఆమె తన భర్త జెమినీ గణేశన్‌ని, రేలంగిని, బి.సరోజాదేవిని, ఎస్వీ రంగారావుని, ఇంకా అనేకమందిని తరుచూ అనుకరించేది. దానధర్మాల విషయంలో అమెది ఎముకలేని చెయ్యి. ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కలిసేందుకు వెళ్ళి, అక్కడ మొత్తం నగలన్నిటినీ ప్రధానమంత్రి సహాయ నిధికి దానంగా ఇచ్చేశారు.
మహానటి సావిత్రి జీవితంలో సంభవించిన వరుస అపజయాలు ఆమెను ఆర్థికంగానూ, మానసికంగానూ బాధించాయి. ఆమె దర్శకత్వం వహించిన మొదటి చిత్రం చిన్నారి పాపలు. ఈ చిత్ర నిర్మాణంలో చాలా మంది పాలుపంచుకున్నారు. వారితో వచ్చిన అభిప్రాయ బేధాల వల్ల ఆమె సొంత ఆస్తులు అమ్మి ఆ సినిమాను పూర్తి చేశారు. తెలుగులో అమోఘ విజయం సాధించిన మూగమనసులు చిత్రాన్ని తమిళంలో నిర్మించి అందులో శివాజీ గణేషన్‌తో నటించారు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం ఆర్థికపతనానికి దారితీసింది. వాస్తవానికి సావిత్రి సినీ జీవితంలో సంపాదించిన ఆస్తులు ఇప్పటి లెక్కల ప్రకారం వందల కోట్లు ఉంటాయట.
సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లోనే జెమిని సంస్థలో ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న గణేశన్ పరిచయమయ్యారు. ఆ తర్వాత హీరో అయిన జెమినీగణేశన్‌తో కలిసి మనంపోల మాంగల్యం చిత్రంలో నటించారు సావిత్రి. మద్రాస్ వచ్చిన తొలి రోజుల నుంచి అతనితో పరిచయం ఉండడంతో పదహారేళ్ళ సావిత్రి ఆ సమయంలోనే జెమినీగణేశన్‌ని ప్రేమించారు. అయితే అప్పటికే అతనికి పెళ్ళి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి సావిత్రితో ప్రేమాయణం సాగించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న సమయంలో తనకు పెళ్ళయిందన్న విషయాన్ని బయటపెట్టాడు. ఏం చెయ్యాలో అర్థంకాని పరిస్థితిలో జెమినీ గణేశన్‌ని పెళ్లి చేసుకున్నారు సావిత్రి. అలమేలు అనే యువతిని పెళ్లి చేసుకోవడమే కాకుండా మరో నటి పుష్పవల్లితో అక్రమ సంబంధం కూడా అతనికి ఉంది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న సావిత్రి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. ఎంతో మానసిక సంఘర్షణను అనుభవించారు. ఆ క్రమంలోనే మద్యానికి బానిసయ్యారు. ఈ విషయం తెలుసుకున్న దర్శకనిర్మాతలు ఆమెతో సినిమాలు చెయ్యడం తగ్గించారు.
రెండు దశాబ్దాల కాలంలో 250కి పైగా సినిమాల్లో నటించిన సావిత్రి ఆరోజుల్లో ఎక్కువ పారితోషికంతోపాటు ఎక్కువ ప్రేక్షకాదరణ కలిగిన నటిగా పేరు తెచ్చుకున్నారు. వ్యక్తిగత జీవితంలోని ఒడుదుడుకులు, ఆర్థికంగా నష్టాలు చవిచూడడం వంటి విషయాలు ఆమెను మనోవేదనకు గురిచేశారు. ఆస్తులన్నీ హరించుకుపోయి చివరి రోజుల్ని ఎంతో దీనంగా గడిపారు సావిత్రి. ఆమె ఆరోగ్య క్షీణంచడంతో 46 ఏళ్ళ చిన్న వయసులో 1981 డిసెంబర్ 6న తుదిశ్వాస విడిచారు.
మహానటి సావిత్రి మరణించి 45 సంవత్సరాలవుతున్నా ఇంకా ఆమె సినిమాలకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటి తరానికి కూడా సావిత్రి సినిమాల గురించి, ఆమె నటన గురించి చక్కని అవగాహన ఉంది అంటే నటిగా ప్రేక్షకులపై ఆమె ముద్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దానికి ఉదాహరణ 2018లో వచ్చిన మహానటి సాధించిన ఘనవిజయం. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించిన ఈ సినిమాను నాగ్ అశ్విన్ రూపొందించారు. మహానటి జీవితానికి అద్దం పట్టిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందింది.
(మహానటి సావిత్రి జయంతి సందర్భంగా..)